వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా విద్యార్థులను కాపాడేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విద్యార్థుల ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు, చదువుపై ఆసక్తి తగ్గడం, ఇంటి సభ్యులకు దూరంగా ఉండడం, అనుమానాస్పద వ్యక్తులతో స్నేహాలు చేయడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్పందించాలని పోలీసులు సూచించారు. మాదకద్రవ్యాల ముఠాలు యువతను లక్ష్యంగా చేసుకునే అవకాశమున్నందున ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహిస్తూ విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న "నషా ముక్త్ భారత్" కార్యక్రమంలో భాగంగా పలు విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అలాగే విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలను మరింత చురుకుగా పనిచేయించాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి మాదకద్రవ్యాల నిర్మూలనకు సహకరించాలని పిలుపునిచ్చారు.